
భద్రాచలం వద్ద గోదావరిఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు నదిలో 18.16 లక్షల క్యూసెక్కుల నీళ్ళు ప్రవహిస్తుండటంతో నీటి మట్టం 62.20 అడుగులకు చేరుకొంది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసి వంతెనపై వాహనాల రాకపోకలు నిషేదించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల వరకు వాహనాలు నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. 1986లో గోదావరి నీటి మట్టం 75.6 అడుగులకు చేరుకోవడంతో వంతెనపై రాకపోకలు నిషేధించారు. మళ్ళీ 36 ఏళ్ల తరువాత ఈరోజు ఆ స్థాయిలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వంతెనపై రాకపోకలు నిషేధం విధించారు.
భద్రాచలం పట్టణంలో రామాలయం దిగువన మోకాలి లోతు నీళ్ళు చేరాయి. పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ తదితర ప్రాంతాలలో కూడా వరదనీరు చేరింది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి బూర్గంపాడు మండలంలో ప్రజలను ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు.