
ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్ట్ 12వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగబోతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ కాలంలో కట్టిన అదే పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్నాయి. కనుక వర్తమాన, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా కేంద్రప్రభుత్వం దాని పక్కనే మరో కొత్త పార్లమెంటు భవనం నిర్మిస్తోంది. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు ఆ కొత్త భవనంలోనే నిర్వహించనున్నారు. కనుక ప్రస్తుత పార్లమెంటు భవనంలో ఈనెల 18 నుంచి జరుగబోయే వర్షాకాల సమావేశాలే చివరి సమావేశాలవుతాయి.
ప్రస్తుత పార్లమెంటు భవనంలోనే సమావేశాల తొలిరోజున రాష్ట్రపతి ఎన్నిక, ఆగస్ట్ 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహిస్తామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.
ఈసారి సమావేశాలలో అగ్నిపథ్ భర్తీలపై ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలద్రోయడంపై ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని ఎండగట్టడం ఖాయం.