కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మోడీ

ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు పక్కనే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై భారత జాతీయ చిహ్నామైన నాలుగు సింహాల కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఆరున్నర మీటర్ల ఎత్తు, 16,000 కేజీల బరువున్న ఈ భారీ విగ్రహాన్ని కొత్త పార్లమెంట్ భవనంపై అంత ఎత్తులో పటిష్టంగా నిలిపి ఉంచేందుకు 6,500 కేజీల బరువుండే భారీ స్టీలు ఫ్రేమ్‌ను ఏర్పాటు చేశారు.

దీనిని నిర్మించేందుకు నిపుణులైన స్థపతుల పర్యవేక్షణలో 100 మందికి పైగా కార్మికులు గత ఆరు నెలలుగా పనిచేశారు. అంతకు ముందు 3-4 నెలలు కంప్యూటరులో అనేక డిజైన్లు పరిశీలించిన తరువాత కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలుపడంతో చకచకా పనులు పూర్తి చేసి నేడు ఆవిష్కరణకు సిద్దం చేశారు. 

ఈ ఏడాది శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలోనే జరుగనున్నాయి. కనుక ఆ భవనంలో కూడా నిర్మాణ పనులు చాలా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే చాలా పనులు పూర్తయ్యాయి. లోపల ఇంటీరియర్ డిజైనింగ్ పనులు జరుగుతున్నాయి. 

జాతీయ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ వైస్ ఛైర్మన్ హరివంశ్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్, ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.