కేసీఆర్‌కు కూడా శ్రీలంక అధ్యక్షుడి గతే: ఈటల

హుజూరాబాద్‌  బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఈరోజు సిఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. “ఉద్యమకారుడినైన నేను కేసీఆర్‌ నిర్ణయాలను, విధానాలను ప్రశ్నిస్తుండటంతో నాపై అవినీతిముద్రవేసి బయటకు పంపించేశారు తప్ప నేను రాజీనామా చేయలేదు. కేసీఆర్‌కు కావలసింది తన మాట వినే బానిసలు తప్ప నావన్తి వారు కాదు. 

నను బయటకు పంపేసినా కేసీఆర్‌కు ఇంకా నాపై కక్ష తీరలేదు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో నన్ను ఓడించి నాకు రాజకీయజీవితం లేయకుండా చేయాలని చాలా ప్రయత్నించారు. ఆ ఉపఎన్నికలలో కేసీఆర్‌ వందల కోట్లు కుమ్మరించి, సుమారు డజను మంది మంత్రులను, మరో డజను మంది ఎమ్మెల్యేలను మోహరించి, పోలీసులను అడ్డంపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడినా నన్ను ఓడించలేకపోయారు. 

కేసీఆర్‌కి దురహంకారం ఎక్కువైపోయింది. దేశంలో నా అంతటివాడు లేడని నోటికి ఎంతోస్తే అంతా మాట్లాడుతూ గర్వంతో విర్రవీగుతున్నారు. అయితే ఇదివరకు ఫామ్‌హౌసుకే పరిమితమైన సిఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌కు రప్పించాము. వచ్చే ఎన్నికలలో ఆయనను నేనే ఓడించి ఇంటికి సాగనంపుతాను. 

కేసీఆర్‌ నిరంకుశ, అప్రజాస్వామిక పాలనతో ప్రజలు కూడా విసుగెత్తిపోయున్నారు. కనుక ఇప్పుడు శ్రీలంకలో ప్రజలు ఏవిదంగా తిరుగుబాటు చేసి దేశాధ్యక్షుడిని తన అధికార నివాసం నుంచి తరిమేశారో అదేవిదంగా రాబోయే రోజుల్లో సిఎం కేసీఆర్‌ని కూడా ప్రగతి భవన్‌ నుంచి ప్రజలు తరిమికొట్టడం ఖాయం,” అని ఈటల రాజేందర్‌ అన్నారు. 

సిఎం కేసీఆర్‌ కేంద్రంలో నరేంద్రమోడీని తరిమికొడతామని హెచ్చరిస్తుంటే, ఈటల రాజేందర్‌ తెలంగాణలో నుంచి కేసీఆర్‌ని తరిమికొడతామని హెచ్చరిస్తుండటం విశేషం. ఎవరు ఎవరిని తరిమికొడతారో వచ్చే ఎన్నికల తరువాత తెలుస్తుంది.