18.jpg)
సిఎం కేసీఆర్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంపై నిన్న నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్‌లో నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “మేము ముందస్తు ఎన్నికలకు మేము సిద్దమే.. బిజెపి కూడా సిద్దంగా ఉందా? మా ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కట్టప్పలు, ఏక్‌నాథ్ షిండేలు సిద్దంగా ఉన్నారని బిజెపి ఎంపీ కే.లక్ష్మణ్ చెప్పడం చాలా దారుణం. ప్రజా ప్రభుత్వాలను కూలద్రోస్తామని చెప్పుకోవడం సిగ్గు చేటు. బిజెపికి దమ్ముంటే మా ప్రభుత్వాన్ని కూలద్రోసి చూపాలి. అసలు మా ప్రభుత్వం కాదు... కేంద్రంలో మోడీ ప్రభుత్వమే పోవాలి.
మోడీ అంత అసమర్ద ప్రధానిని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఆయన పాలనలో దేశం అన్నీ రంగాలలో భ్రష్టు పట్టిపోతోంది. ఇంకా ఆయన పాలన కొనసాగితే దేశం 20 ఏళ్ళు వెనక్కు వెళ్ళిపోతుంది. కనుక మోడీని, ఆయన ప్రభుత్వాన్ని తప్పనిసరిగా గద్దె దించి బిజెపియేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందే.
దేశాన్ని, బిజెపి పాలితరాష్ట్రాలను అభివృద్ధి చేయలేనివారు హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయాలని చెప్పడం సిగ్గుచేటు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేసిచూపిన మా తెలంగాణ ప్రభుత్వమే నిజమైన డబుల్ ఇంజిన్ సర్కార్. కనుక కేంద్రంలో కూడా మావంటి డబుల్ ఇంజిన్ సర్కార్ రావలసిందే. అప్పుడే ఈ దేశం మళ్ళీ గాడినపడుతుంది. టిఆర్ఎస్ తప్పకుండా జాతీయస్థాయి పార్టీగా ఆవిర్భవిస్తుంది. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి దేశాన్ని గాడిలో పెడుతుంది,” అని సిఎం కేసీఆర్ అన్నారు.
సిఎం కేసీఆర్ ఇంకా అనేక అంశాలను ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బహుశః బిజెపి ఎంపీ కే.లక్ష్మణ్ టిఆర్ఎస్ పార్టీలో కట్టప్పలు ఉన్నారని వారి సాయంతో తన ప్రభుత్వాన్ని కూలద్రోస్తామని చెప్పడమే సిఎం కేసీఆర్ ఆగ్రహానికి కారణం అయ్యుండవచ్చు. కనుక బిజెపికి అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చినట్లు భావించవచ్చు.
బిజెపికి తమ ప్రభుత్వాన్ని కూలద్రోసే ఆలోచన ఉందని సిఎం కేసీఆర్ కూడా గ్రహించారు కనుక అటువంటి ప్రమాదంలో చిక్కుకోకముందే ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు.