2.jpg)
హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈరోజు సంచలన నిర్ణయం ప్రకటించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ వచ్చే ఎన్నికలలో నేను గజ్వేల్ నుంచి కేసీఆర్ మీదనే పోటీ చేస్తా. నేను బిజెపిలో చేరే ముందు ఇదే షరతు విధించి వారు అంగీకరించిన తరువాతే పార్టీలో చేరాను. వచ్చే ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ను ఆయన నియోజకవర్గంలో ఓడించి, రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తేవడమే నా లక్ష్యం.
సిఎం కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. 2014 నాటికే గిరిజనులకు 3.92 లక్షల ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది. తాను అధికారంలోకి రాగానే స్వయంగా మంత్రులను, అధికారులను వెంటబెట్టుకొని ఒక్కో జిల్లాలో పర్యటించి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మళ్ళీ 2018 ఎన్నికలప్పుడు ఆ తరువాత కూడా తాను స్వయంగా వచ్చి పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు వెళ్ళకపోగా ఫారెస్ట్ అధికారులను పంపించి అదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలలో తరతరాలుగా పోడు భూములను సాగుచేసుకొంటున్న గిరిజనులను ఇళ్ళలో నుంచి బయటకు లాకొచ్చి వారి సామాను బయటపడేసి ఇళ్ళను కూల్చేస్తున్నారు. గిరిజనులపై పోలీసుల చేత లాఠీ ఛార్జ్ చేయిస్తున్నారు. నిరుపేద గిరిజనులకు న్యాయం చేయకపోగా వారి భూములను లాక్కొని, ఇళ్ళను కూల్చివేయిస్తున్నారు. ఇందుకేనా కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకొన్నది?గిరిజనుల పట్ల ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్న మీకు వచ్చే ఎన్నికలలో ప్రజలే బుద్ది చెపుతారు,” అని ఈటల రాజేందర్ అన్నారు.