టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎప్పుడూ వివాదాలలో మునిగి తేలుతూనే ఉంటారు. తాజాగా ఆయన హైదరాబాద్ శివారులోని పటాన్చెరు సమీపంలో గల ఓ మామిడితోట కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో డీఎస్పీ భీంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మఫ్టీలో వెళ్ళి దాడి చేశారు.
అక్కడ మొత్తం 70 మంది కోడి పందెలలో పాల్గొంటుండగా పోలీసులు వస్తున్నట్లు పసిగట్టి చింతమనేనితో సహా 49 మంది తప్పించుకొని పారిపోయారు. మిగిలినవారిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన వారిలో అక్కినేని సతీష్, కృష్ణం రాజు, బర్ల శ్రీను అనే ముగ్గురు నిర్వాహకులు కూడా ఉన్నారు. వారి నుంచి భారీగా అనగాడు, సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ని ప్రశ్నించగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యవర్యంలో గత 10 రోజులుగా అక్కడ గుట్టుగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోడి పందెలలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు చింతమనేని ప్రభాకర్ కోసం గాలింపు మొదలుపెట్టారు. కానీ ఆయన సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లు తెలుస్తోంది.
మీడియాలో వస్తున్న ఈ వార్తలపై చింతమనేని స్పందిస్తూ, “కోడి పందేలు జరుగుతున్న చోట లేని నా గురించి సాక్షి మీడియా అసత్య కధనాలు ప్రచురించి దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీ నేతలు నన్ను రాజకీయంగా ఎదుర్కొలేకనే ఈవిదంగా సాక్షి మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీని, సాక్షిని కూకటివేళ్ళతో పెకలించవలసిన సమయం దగ్గర పడుతోంది,” అని అజ్ఞాతప్రదేశం నుంచి మీడియాకు ఓ సందేశం పంపించారు.