నాలుగు రాజ్యసభ సీట్లు దక్షిణాది ప్రముఖులకే

ఈసారి కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులకి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (తమిళనాడు), ప్రముఖ సినీ కధా రచయిత విజయేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్‌), పరుగుల రాణి పిటి ఉష (కేరళ), ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వీరేంద్ర హెగ్గడే (కర్నాటక)లను రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురు ప్రముఖులు దక్షిణాది ప్రజలందరికీ చిరపరిచితులు. 

ఇళయరాజా తమిళనాడులో మధురైలో జన్మించారు. గత 50 ఏళ్లుగా దక్షిణాది సినీ పరిశ్రమలో వెయ్యికి పైగా సినిమాలలో ఏడువేలకు పైగా పాటలకు సంగీతం సమకూర్చారు. కనుక ఇళయరాజా పాట, పేరు ప్రతీ ఇంట్లో వినబడుతూనే ఉంటుంది. ఇళయరాజా పద్మ భూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకొన్నారు. 

పరుగుల రాణి పిటి ఉష కేరళలో కోజీకోడ్ జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో జన్మించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు అనేక పతకాలు సాధించిపెట్టారు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలలో 14 పసిడి పతకాలు సాధించి భారత్‌కు గర్వకారణంగా నిలిచారు. క్రీడారంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం అర్జున, పద్మశ్రీ అవార్డులతో సన్మానించింది.  

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వస్థలం ఏపీలో కొవ్వూరు. భజరంగీ భాయిజాన్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన కధలు అందించారు. భజరంగీ భాయిజాన్ సినిమాకు 2016లో ఉత్తమ కధా రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకొన్నారు. రాజ్యసభకు నామినేట్ అవడం మరో గొప్ప అవార్డుగానే భావించవచ్చు. 

కర్ణాటకు చెందిన వీరేంద్ర హెగ్గడే స్థాపించిన ధర్మస్థల మంజునాధ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా గత నాలుగు దశాబ్ధాలుగా వేలాదిమంది నిరుపేద పిల్లలకు విద్యను అందిస్తున్నారు. ఆ సంస్థ అధ్వర్యంలో 6 లక్షల స్వయం సహాయ సంఘాలు పనిచేస్తున్నాయి. పిల్లలకే కాక గ్రామాలలో నివసించేవారికి స్వయం ఉపాధి కల్పించేందుకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు కూడా నడిపిస్తూ గ్రామీణాభివృద్ధిలో చాలా కీలకపాత్ర పోషిస్తున్నారు. కేంద్రప్రభుత్వం 2015లో ఆయనను పద్మ విభూషణ్ అవార్డుతో సన్మానించింది.