ఇక ఆ పని మీదే ఉంటాను: కొండా

ఇటీవల బిజెపిలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌ బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “నేను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చేసిన తరువాత ఏడాదిన్నర పైగా తటస్థంగా ఉన్నాను. కానీ అప్పుడు ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ముఖ్యంగా కాంగ్రెస్‌ నేతలు ఎవరూ పాటించుకోలేదు. కానీ ఇప్పుడు నేను బిజెపిలో చేరగానే తమకు మాట మాత్రంగానైనా చెప్పలేదని రేవంత్‌ రెడ్డి బాధపడినట్లు తెలిసింది. అయితే నేను బిజెపిలో చేరబోతున్నట్లు ఆయనతో సహా కాంగ్రెస్ పార్టీలో నేతలందరికీ తెలుసు. కనుక ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి అనుకోవడం అనవసరమని భావిస్తున్నాను.

నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకువస్తున్నప్పుడే చెప్పాను. రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌కి, టిఆర్ఎస్‌ పార్టీకి ఏ పార్టీ ఎదురు నిలిచి పోరాడుతుందో ఆ పార్టీలో చేరుతానని. రాష్ట్రంలో ఒక్క బిజెపి మాత్రమే సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ పార్టీని ఎదుర్కోగలదని గట్టిగా నమ్ముతున్నాను. అందుకే బిజెపిలో చేరాను. పార్టీలో చేరగానే నా లక్ష్య సాధన దిశలో పనిచేసేందుకు వీలుగా నాకు చేరికల సమన్వయ కమిటీలో స్థానం కల్పించారు. కనుక ఇక నుంచి వేరే పార్టీలలో నాకున్న పరిచాయాలతో నెలకు ఒక్కరినైనా బిజెపిలోకి తీసుకువస్తాను. ఇక నుంచి నేను ఇదే పని మీద ఉంటాను,” అని చెప్పారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో మళ్ళీ చేవెళ్ళ నియోజకవర్గం నుంచే పోటీ చేయవచ్చు కనుక ముందుగా అక్కడి నుంచే తన పని మొదలుపెడతారని భావించవచ్చు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, తీగల కృష్ణారెడ్డికి మద్య చాలా కాలంగా విభేధాలు ఉన్నందున అసంతృప్తిగా ఉన్న తీగను లాగే ప్రయత్నం చేస్తారేమో? తీగ లాగితే మరి టిఆర్ఎస్‌ డొంక కదులుతుందా?చూడాలి.