కృష్ణన్న అలా ఎందుకు మాట్లాడారో తెలీదు: సబితా రెడ్డి

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీర్‌పేట్‌లో చెరువులు, పాఠశాలల భూములు కబ్జాలు చేస్తున్నారంటూ టిఆర్ఎస్‌ నేత తీగల కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై ఆమె వెంటనే స్పందించారు. 

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మాజీ ఎమ్మెల్యే కృష్ణన్న నాగురించి ఏమన్నారో నేను వినలేదు. ఒకవేళ ఏమైనా అని ఉంటే ఆయనను ఎవరో తప్పుదోవ పట్టించి ఉంటారు. అది ఎవరో నాకు తెలీదు కానీ నేను ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదు. కబ్జాలను ప్రోత్సహించలేదు. ఇటువంటి అక్రమాలకు ఎవరు పాల్పడినా సిఎం కేసీఆర్‌ సహించరు. ఇదేమీ పెద్ద సమస్య కాదు. నేను ఆయనతోనే మాట్లాడి సమస్య ఏవైనా ఉంటే పరిష్కరించుకొంటాను,” అని అన్నారు. 

2009లో మళ్ళీ 2018 ఎన్నికలలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి తీగల కృష్ణారెడ్డిని రెండుసార్లు ఓడించారు. మొదటిసారి తీగల టిడిపిలో ఉన్నప్పుడు, రెండోసారి టిఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఆమె చేతిలో ఓడిపోయారు. 

ఆ తరువాత ఆమె కూడా టిఆర్ఎస్‌ పార్టీలో చేరడం, సిఎం కేసీఆర్‌ ఆమెకు వెంటనే మంత్రి పదవి ఇవ్వడంతో నియోజకవర్గంలో ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయింది. బహుశః అందుకే తీగలకు ఆమె పట్ల కోపం, ద్వేషం కలిగి ఉండవచ్చు. అది సహజమే. కానీ రాజకీయాలలో కోపం, ద్వేషంతో ఏదీ సాధించలేరు. అవకాశాలను అందిపుచ్చుకొంటూ రాజకీయంగా ఎదుగుతూ ఉండాలి లేకుంటే ఇలా మిగిలిపోతుంటారు.         

పార్టీ మారే ఉద్దేశ్యంతోనే మంత్రి సబితపై బహిరంగంగా ఇటువంటి తీవ్ర ఆరోపణలు చేసారని మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ, “నేను బ్రతికి ఉన్నంతకాలం టిఆర్ఎస్‌ పార్టీలోనే ఉంటాను. ఒకవేళ పార్టీని వీడాల్సి వస్తే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకొంటాను. నేను చీప్ రాజకీయనాయకుడిని కాను. అయినా కాంగ్రెస్‌, బిజెపిలలో నాకంటే ఉత్తములు ఎవరైనా ఉన్నారా?” అని తీగల ప్రశ్నించారు.