దేశంలో స్టార్టప్స్... రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రం

దేశంలో గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు చాలా రంగాలలో అగ్రస్థానంలో ఉంటాయి. అయితే 8 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ కూడా ఇప్పుడు అన్ని రంగాలలో వాటితో పోటీ పడుతూ ఒకటి, రెండు స్థానాలలో నిలుస్తుండటం విశేషం. 

తాజాగా దేశంలో వివిద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వాల స్టార్టప్ పాలసీలు, అవి కల్పిస్తున్న సౌకర్యాలు, ఔత్సాహిక యువతకు అందిస్తున్న చేయూత, ప్రోత్సాహకాలు తదితర అంశాల ఆధారంగా కేంద్రప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. వాటిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 

కోటి అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, కోటి అంత కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లెక్కన స్టార్టప్ మెగాస్టార్స్ (బెస్ట్ పెర్ఫర్మర్స్), సూపర్ స్టార్స్ (టాప్ పెర్ఫార్మర్స్), స్టార్స్ (ది లీడర్స్), రైజింగ్ స్టార్స్ (యాస్పైరింగ్ లీడర్స్), సన్‌రైజర్స్ (ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్) ర్యాంకులు ప్రకటించింది. 

కేంద్రవాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ఈ ర్యాంకులను విడుదల చేశారు. వాటిలో గుజరాత్‌, కర్నాటక రాష్ట్రాలకు మెగాస్టార్స్ ర్యాంకుతో నంబర్: 1 స్థానంలో నిలువగా, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కేంద్రపాలిత ప్రాంతమైన కశ్మీర్ సూపర్ స్టార్స్ రాంకులతో రెండో స్థానంలో నిలిచాయి. 

ఆ తరువాత మూడో స్థానంలో తమిళనాడు, యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, అస్సాం, గోవా, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు రైజింగ్ స్టార్స్ కేటగిరీలో నిలిచాయి. 

స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో పూర్తిగా వెనుకబడిన బీహార్ రాష్ట్రం సరసన ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. వాటి సరసన మిజోరాం, లద్దాఖ్ ఉన్నాయి. వీటికి కేంద్రం సన్ రైజర్స్ ర్యాంక్ ఇచ్చింది.