10.jpg)
ఇవాళ్ళ (శనివారం) హైదరాబాద్లో ఓ వైపు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుంటే, మరోపక్క రాష్ట్రపతి ఎన్నికలలో విపక్ష అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రావడంతో టిఆర్ఎస్ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతూ జలవిహార్లో టిఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ హిందీలో చాలా సుదీర్గంగా ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేశారు. వివిద అంశాలపై ప్రధాని నరేంద్రమోడీని సూటిగా ప్రశ్నించి, రేపు జరుగబోయే బిజెపి సభలో అన్నిటికీ సమాధానాలు చెప్పాలని సిఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఈ 8 ఏళ్లలో మోడీ హయాంలో దేశం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని అన్నారు. దేశంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించకుండా, కొత్త సమస్యలు సృష్టిస్తూ ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారని సిఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అసమర్దత కారణంగా దేశం నుంచి ఫోర్డ్ వంటి పలు అంతర్జాతీయ కంపెనీలు వెనక్కు వెళ్లిపోయాయని అన్నారు.
ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ, లాభాలలో నడుస్తున్న ఎల్ఐసీ వంటి కేంద్రప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ వాటిలో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు.
కరోనాను ఎదుర్కోవడంలో మోడీ దారుణంగా విఫలమయ్యారని, ఆ కష్టకాలంలో హటాత్తుగా లాక్డౌన్ విధించడం వలన దేశవ్యాప్తంగా లక్షలాదిమంది వలస కార్మికులు వేలాదికిలోమీటర్లు కాలినడకన నడుచుకొంటూ స్వగ్రామాలకు వెళుతుంటే వారి కోసం కనీసం ఉచితంగా రైళ్లు కూడా ఏర్పాటుచేయకుండా చాలా అమానవీయంగా వ్యవహరించారని సిఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ఏవో మున్సిపల్ ఎన్నికలన్నట్లు ప్రధాని నరేంద్రమోడీ డోనాల్డ్ ట్రంపును వెనకేసుకువచ్చి చాలా అనాలోచితంగా వ్యవహరించినందుకు అమెరికా మనకు దూరమైందని అన్నారు.
మోడీ ప్రభుత్వం అసమర్దత, అనాలోచిత నిర్ణయాల వలననే దేశం పెనుసంక్షోభంలో చిక్కుకుపోయిందని అన్నారు. ఎన్నడూ లేనివిదంగా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 79కి పడిపోయిందని అన్నారు. కనుక నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించక తప్పదని అన్నారు. ఈ వేదిక మీద నుంచి దేశ ప్రజల తరపున తాను అడుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికీ రేపు సికింద్రాబాద్లో జరుగబోయే బిజెపి బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ తప్పకుండా సమాధానాలు చెప్పాలని సిఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
యశ్వంత్ సిన్హా అపార రాజకీయానుభవం, పరిపాలనాభవం ఉన్న గొప్ప నాయకుడు అని ఆయనకు అందరూ మద్దతు పలికి రాష్ట్రపతిగా గెలిపించుకోవలసిన అవసరం ఉందని అన్నారు.