హైదరాబాద్‌లో మనీ హైస్ట్ పోస్టర్

హైదరాబాద్‌లో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య పోస్టర్ల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. నేడు రేపు హైదరాబాద్‌ బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో ఓ పోస్టర్ ప్రత్యక్షమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత పాపులర్ అయిన ‘మనీ హైస్ట్’ వెబ్‌ సిరీస్‌లో ఎర్ర దుస్తులు, మొహాలకు మాస్కులు ధరించి, చేతిలో తుపాకులు పట్టుకొని ఉన్న బ్యాంకును దోచుకొనే దొంగల ఫోటోలను ముద్రించారు.  దానిపై “మిస్టర్. ఎన్‌.మోడీ... మేము బ్యాంకులను మాత్రమే దోచుకొంటాము. మీరు యావత్ దేశాన్నే దోచుకొంటున్నారు,” అని వ్రాశారు. 

మోడీ ప్రభుత్వం దేశంలో కేంద్రప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తుండటం, పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ ధరలు పెంచేస్తుండటం, విజయ్ మాల్యా వంటి వారు దేశంలో బ్యాంకుల నుంచి వేలకోట్లు అప్పులు తీసుకొని ఎగవేసి పారిపోతున్నా పట్టించుకోకపోవడం వంటివన్నీ దేశాన్ని దోచుకోవడమే అని సదరు పోస్టర్ పెట్టిన వ్యక్తి అభిప్రాయంగా కనిపిస్తోంది.

దీనిని టిఆర్ఎస్‌ పార్టీయే పెట్టించి ఉండవచ్చని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ పోస్టరుపై టిఆర్ఎస్‌ స్పందించలేదు. అయితే ఇదివరకు #బై బై మోడీ అంటూ సికింద్రాబాద్‌ పెరేడ్ గ్రౌండ్ వద్ద వెలిసిన పోస్టర్ కంటే ఈ పోస్టర్ అందరినీ బాగా ఆకట్టుకొంటోంది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఈ పోస్టరును తొలగించారు.