నేటి నుంచే హైదరాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు

నేడు, రేపు హైదరాబాద్‌ బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, బిజెపి పాలిత 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా అన్ని రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు, బిజెపి ముఖ్య నేతలు ఈ రెండు రోజుల సమావేశాలకు హాజరుకానున్నారు. 

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌ చేరుకొని హెచ్‌ఐసీసీలో జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈరోజు ఉదయం 9 గంటలకు బిజెపి జాతీయ పదాధికారుల సమావేశం జరుగనుంది. దానిలో జాతీయ ప్రధాన కార్యదర్శులు సమర్పించిన అజెండాపై చర్చించనున్నారు. 

ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ చేరుకొని జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు రాత్రి 9 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశాలలో ప్రధానంగా దేశ ఆర్ధిక రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాలవారీగా బిజెపి పరిస్థితిని సమీక్షించి పార్టీ సంస్థాగత నిర్మాణం, తెలంగాణలో బిజెపి, టిఆర్ఎస్‌ పార్టీల పరిస్థితి, 8ఏళ్ళ మోడీ పాలనలో దేశవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలు, చివరిగా మోడీ పాలనను అభినందిస్తూ తీర్మానాలు ఉంటాయని సమాచారం. 

మళ్ళీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌ పెరేడ్ గ్రౌండ్‌లో బిజెపి  అధ్యవార్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువురు ముఖ్యనేతలు ప్రసంగిస్తారు. సభ ముగిసిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ రాజ్‌భవన్‌ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. మర్నాడు అంటే జూలై 4వ తేదీన ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరిస్తారు.