
ఎల్లుండి ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బిజెపి అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఆ సభలో ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువురు కేంద్రమంత్రులు, బిజెపి ముఖ్యనేతలు పాల్గొనబోతున్నారు. కనుక బహిరంగ సభ జరుగబోయే పెరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల ప్రాంతాలలో 4,000 మంది పోలీసులు, డిఐజి, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ తెలిపారు. సభ ముగిసిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ రాజ్‌భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారని చెప్పారు. కనుక ఆదివారం దిగువ పేర్కొన్న ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఉంటాయని తెలిపారు.
హెచ్ఐసీసీ పరిధిలో నీరూస్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్ళేవారు సీవొడీ నుంచి దుర్గం చెరువు, బయోదైవర్సిటీ మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.
రామచంద్రాపురం, చందానగర్, మాధాపూర్, గచ్చిబౌలి, నుంచి వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్, హెచ్‌సీయూ, ట్రిపుల్ ఐటీ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.
మియాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట నుంచి వచ్చేవాహనాలు ఏఐజీ ఆసుపత్రి, దుర్గం చెరువు మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.