తెలంగాణ బిజెపికి పెద్ద షాక్

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పాగా వేయాలనే ఉద్దేశ్యంతో రేపు ఎల్లుండి హైదరాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించబోతుంటే, జీహెచ్‌ఎంసీలోని నలుగురు బిజెపి కార్పొరేటర్లు ఈరోజు తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో టిఆర్ఎస్‌ పార్టీలో చేరిపోయి బిజెపికి పెద్ద షాక్ ఇచ్చారు. 

డేరంగుల వెంకటేష్ (జూబ్లీహిల్స్‌), భానోత్ సుజాతా నాయక్ (హస్తినాపురం), సునీతా ప్రకాష్ గౌడ్ (అడిక్‌మెట్‌), పొడవు అర్చనా ప్రకాష్ (రాజేంద్రనగర్) టిఆర్ఎస్‌ పార్టీలో చేరారు. వారితో పాటు తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫాబాద్‌లో కూడా టిఆర్ఎస్‌లో చేరిపోయారు.    

మూడు రోజుల క్రితమే ఖైరతాబాద్‌ టిఆర్ఎస్‌ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి టిఆర్ఎస్‌ పార్టీకి షాక్ ఇవ్వగా, ఇప్పుడు బిజెపి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలయ్యే కొన్ని గంటల ముందు నలుగురు కార్పొరేటర్లు టిఆర్ఎస్‌ పార్టీలో చేరిపోవడం బిజెపికి ఊహించని షాక్ అనే చెప్పాలి. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ పార్టీని బిజెపి కంగు తినిపించగా, ఇప్పుడు బిజెపికి టిఆర్ఎస్‌ ఈ షాక్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర బిజెపి నేతలందరూ రేపటి నుంచి మొదలవబోయే జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాటు హడావుడిలో ఉన్నందున ఎవరూ దీనిపై స్పందించలేదు.