ప్లాస్టిక్ వ్యర్ధాలతో పర్యావరణానికి, పశుపక్షాదులకు కూడా హాని కలుగుతున్నందున నేటి నుంచి దేశవ్యాప్తంగా ఒక్కసారి వాడి పడేసే పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేదం అమలులోకి వచ్చింది. నేటి నుంచి వీటి ఉత్పత్తి, పంపిణీ, నిల్వ, అమ్మకం, వినియోగాలపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
ఈ నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే పర్యావరణ పరిరక్షణ చట్టం (ఈపీఏ)లోని స్కేషన్ 15 మరియు వివిద రాష్ట్రాలలో మునిసిపల్ చట్టాల ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ ఉంటాయని హెచ్చరించింది.
సింగిల్-యూజ్-ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, వాటిలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అమలుచేయస్తాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. దీని కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్స్, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వీటి రవాణాను అరికట్టేందుకు సరిహద్దులలో చెక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
నిషేదించబడిన కొన్ని ప్లాస్టిక్ ఉత్పత్తులు:
100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, పీవీసీ బ్యానర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, ఇయర్‌బడ్స్, పిప్పరమెంట్లకు, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ ఐస్‌క్రీమ్ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మోకోల్ షీట్లు, వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్ కోసం వాడే పల్చటి రేపర్స్, సిగరెట్ ప్యాకెట్లపై పలుచటి ప్లాస్టిక్ సీలింగ్ వగైరా.
ఇది చాలా మంచి నిర్ణయమే. నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేదం విధించబోతున్నట్లు కేంద్రప్రభుత్వం సుమారు ఏడాది క్రితమే ప్రకటించింది కనుక ఆయా ఉత్పత్తులను తయారుచేసే చిన్నా, పెద్ద పరిశ్రమలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు తగినంత సమయం ఇచ్చినట్లే. అయితే దేశవ్యాప్తంగా కొన్ని కోట్లమంది ఈ ఉత్పత్తుల తయారీ, పంపిణీ, అమ్మకాలు, వినియోగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మరి వారందరి పరిస్థితి ఏమవుతుందో తెలీదు. కానీ వీటికి ప్రత్యామ్నాయంగా ఉత్పత్తులను తయారుచేందుకు కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయి కనుక ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే.