దేశంలో మరో ప్రభుత్వం కూల్చివేత..ఉద్ధవ్ థాక్రే రాజీనామా!

ఎన్నికలలో పోటీ చేసి ప్రజల ఆమోదంతో అధికారంలోకి వస్తే అది ఎంతో హుందాగా ఉంటుంది. కానీ ప్రజలెన్నుకొన్న ప్రభుత్వంలో అసమ్మతి చిచ్చు రగిలించి, ఎమ్మెల్యేలను విడదీసి ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి రావడం చాలా సిగ్గుచేటు. దీనిని ఎవరూ హర్షించలేరు. ఇప్పటికే పలురాష్ట్రాలలో ఈవిదంగా దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన బిజెపి ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారం చేపట్టబోతోంది. 

సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే 39 మంది ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయగా వారికి బిజెపి తెర వెనుక సహాయసహకారాలు అందించి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేలా చేసింది. ఎప్పటిలాగే ఈ రాజకీయ సంక్షోభంలో గవర్నర్ తన పాత్ర సమర్ధంగా పోషిస్తూ గురువారం ఉదయం శాసనసభలో బలనిరూపణ చేసుకోవలసిందిగా ఆదేశించారు. శివసేన ఎమ్మెల్యేలు షిండేవైపు వెళ్ళిపోవడంతో సిఎం ఉద్ధవ్ థాక్రే బుదవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండున్నరేళ్ళ మహా ప్రభుత్వం కూలిపోయింది. 

ఉద్ధవ్ థాక్రే వెనక్కు తగ్గడంతో బిజెపి తెర వెనుక నుంచి ముందుకు వచ్చి అధికారం చేపట్టేందుకు సిద్దం అయ్యింది. మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం శాసనసభలో బలనిరూపణ చేసుకోనున్నారు. బిజేపీ అధికారంలోకి రావడానికి సహకరించినందుకు ఏక్‌నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆయన వర్గానికి 10 మంత్రి పదవులు ఇచ్చేందుకు అగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం.