
హుజురాబాద్ బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. మెదక్ జిల్లా మూసయిపేట మండలంలోని అచ్చంపేట్, హకీంపేట్ గ్రామాలలో ఆయన కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ అధీనంలో ఉన్న అసైన్డ్ భూములను రెవెన్యూ అధికారులు సంబంధిత రైతులకు వాపసు చేశారు.
మెదక్, నర్సాపూర్, తుఫ్రాన్ ఆర్డీవోల సమక్షంలో రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూముల పంచనామా ప్రక్రియ నిర్వహించి, పాత రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం 69 మంది లబ్దిదారులను గుర్తించి వారికి ఆ భూముల యాజమాన్యపు హక్కులను ధృవీకరిస్తూ పట్టాలను అందజేశారు.
వాటిపై ఏనాడో ఆశలు వదిలేసుకున్న గ్రామస్తులు ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ తమ భూములు తమకు దక్కినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈటల కుటుంబం చేతిలో చిక్కుకొన్న తమ భూములను తిరిగి ఇప్పించినందుకు వారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి, నర్సాపూర్ ఎమ్మెల్యే సి.మదన్ రెడ్డికి, రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఇది ఈటల రాజేందర్‌కు చాలా పెద్ద షాకే అని చెప్పవచ్చు. ఈ వివాదంపై ఆయన ఇదివరకే హైకోర్టులో కేసు వేశారు కనుక ఇప్పుడు మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారేమో? కానీ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను నయాన్నో, భయాన్నోతీసుకోవడం నేరం కనుక ఈ వ్యవహారంలో ముందుకు వెళితే ఆయనకే ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. మరి ఈ అసైన్డ్ భూముల పంపిణీపై ఈటల రాజేందర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.