13.jpg)
తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బిజెపి ఆ దిశలో గట్టి ప్రయత్నాలే చేస్తోంది. వచ్చే నెల 2,3 తేదీలలో హైదరాబాద్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుండటం, వాటి కోసం ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ వచ్చి రెండురోజులు బస చేస్తుండటమే ఓ నిదర్శనంగా భావించవచ్చు.
అయితే రాష్ట్ర బిజెపి నేతలకు అత్యుత్సాహంతో నాంపల్లిలోని తమ పార్టీ కార్యాలయం ముందు “సాలు దొర... సెలవు దొర” అంటూ ఓ డిజిటల్ సైన్ బోర్డ్ ఏర్పాటు చేశారు. దానిలో సిఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజేస్తూ కౌంట్ డౌన్ కూడా ఏర్పాటుచేశారు. అది టిఆర్ఎస్ పార్టీకి ఆగ్రహం కలిగించడం సహజమే. కనుక ట్విట్టర్లో ఓ నెటిజన్ ఫిర్యాదు చేశారంటూ జీహెచ్ఎంసీ బిజెపి కార్యాలయానికి రూ.50 వేలు జరిమానా విధించింది. ఆ బోర్డు పక్కనే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టినందుకు మరో రూ.5,000 కలిపి మొత్తం రూ.55,000 జరిమానా చెల్లించాలంటూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట చలాన్లు పంపించింది. అనుమతి లేకుండా నిబందనలకు విరుద్దంగా డిజిటల్ డిస్ప్లే బోర్డు, ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టినందుకే జరిమానా విధిస్తున్నట్లు చలాన్లలో పేర్కొంది. అయితే బిజెపి వాటిపై స్పందించలేదు. ఆ బోర్డులు తీయలేదు.
ఈరోజు ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సమీపంలో ‘#బై బై మోడీ’ అంటూ మోడీ బొమ్మతో ఓ ఫ్లెక్సీ బ్యానర్ వెలిసింది. కంటోన్మెంట్ అధికారులు దానిని వెంటనే తొలగించారు. ఒకవేళ బిజెపి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్ప్లే బోర్డును, ఫ్లెక్సీ బ్యానర్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తే అప్పుడు బిజెపి నేతలు ఈ బై బై మోడీ బ్యానర్ గురించి వారిని నిలదీయడం ఖాయం. కనుక టిఆర్ఎస్, బిజెపిల మద్య మొదలైన ఈ పోస్టర్ల యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో ఏవిదంగా ముగుస్తుందో చూడాలి.