సికింద్రాబాద్‌లో బై బై మోడీ పోస్టర్లు!




తెలంగాణలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు క్రమంగా వికృతరూపం దాల్చుతోంది. సిఎం కేసీఆర్‌కు కౌంట్ డౌన్‌ మొదలైందంటూ బిజెపి బ్యానర్లు పెడితే, దానికి పోటీగా టిఆర్ఎస్‌ కూడా ‘బైబై మోడీ’ అంటూ బ్యానర్లు పెట్టింది. 

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ సమీపంలో టివోలి థియేటర్ వద్ద గల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘#బై బై మోడీ’ అంటూ ఈరోజు ఉదయం ఓ భారీ ఫ్లెక్సీ బ్యానర్ వెలిసింది. దానిలో బిజెపి ఎన్నికల హామీలలో ఒకటైన విదేశాలలో దాచి ఉంచిన నల్లధనం వెనక్కు తీసుకురావడంతో పాటు, ఈ ఎనిమిదేళ్ళలో మోడీ ప్రభుత్వం తీసుకొన్న వివాదస్పద నిర్ణయాలు… పెద్దనోట్ల రద్దు, వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, అగ్నిపథ్‌ వంటివి ముద్రించి కిందన #బై బై మోడీ అని ముద్రించారు. 

ఈ ఫ్లెక్సీ బ్యానర్‌ను ఎవరు పెట్టారో తెలీదు కానీ టిఆర్ఎస్‌కు చెందినవారే అయ్యుండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకొన్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అధికారులు వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆ ఆ ఫ్లెక్సీ బ్యానర్‌ను తొలగించారు. 

జూలై 2,3 తేదీలలో హైదరాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా జాతీయ రాష్ట్ర స్థాయి పార్టీ ముఖ్యనేతలు అందరూ హాజరుకానున్నారు. రాష్ట్ర బిజెపి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నగరం నడిబొడ్డున ఫ్లెక్సీ బ్యానర్‌ పెట్టడంపై బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.