
తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్ధించగా, హైకోర్టు అందుకు నిరాకరించింది.
2018 ఎన్నికలలో కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయగా, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు చేస్తున్నప్పుడు, ఈవీఎం మెషిన్లకు అనుసంధానం చేయబడిన వివి ప్యాట్ మెషిన్ స్లిప్పులను లెక్కించి సరిపోల్చుకొన్న తరువాత ఫలితాలు ప్రకటించవలసి ఉంటుంది. కానీ ఎన్నికల అధికారులు ఆ స్లిప్పులను లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ప్రకటించేరని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే అని ఆరోపిస్తూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత కొప్పుల ఈశ్వర్ అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.
ఒకవేళ హైకోర్టు పిటిషనర్ వాదనలతో ఏకీభవించి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పినట్లయితే ఆయనకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. కానీ హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినట్లయితే సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కనుక ఈ కేసు విచారణ పూర్తయ్యి తీర్పు వెలువడేలోగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసినా ఆశ్చర్యం లేదు.