గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ వెలుగువెలిగిన మంత్రులలో జూపల్లి కృష్ణారావు కూడా ఒకరు. అయితే రెండోసారి శాసనసభ ఎన్నికలలో జూపల్లి ఓడిపోవడంతో సిఎం కేసీఆర్ ఆయనను పూర్తిగా పక్కనపెట్టేశారు. అప్పటి నుంచి పార్టీలో కూడా ఆయనకు ప్రాధాన్యత తగ్గిపోయింది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన రెడ్డితో విభేధాలు కూడా ఉండటంతో గత కొంతకాలంగా ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధిష్టానం వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్న జూపల్లి కృష్ణారావు పార్టీ మారాలనే ఆలోచన కూడా వేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇవాళ్ళ మంత్రి కేటీఆర్ కొల్లాపూర్‌లో పర్యటిస్తున్నారని తెలిసి ఉన్నా జూపల్లి వెళ్ళికలవలేదు. దాంతో మంత్రి కేటీఆర్ కొల్లాపూర్‌లో తన కార్యక్రమాలు ముగించుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతూ నేరుగా జూపల్లి ఇంటికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. ఈ సందర్భంగా జూపల్లి తన మనసులో ఆవేదనను కేటీఆర్‌తో పంచుకోగా ‘అన్నీ నేను చూసుకొంటానని’ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తరువాత మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి కూడా జూపల్లితో మాట్లాడటంతో ఆయన కాస్త చల్లబడ్డారు. తరువాత అందరూ ఛాయ్ తాగుతూ కాసేపు కులాసాగా కబుర్లు చెప్పుకొన్నారు. కనుక జూపల్లి కృష్ణారావు పార్టీ మారే ఆలోచన విరమించుకొన్నట్లేనా?అనే ప్రశ్నకు త్వరలో ఆయనే సమాధానం చెపుతారు.