
నిన్న సికింద్రాబాద్లో రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లలో పాల్గొన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా దిగ్బ్రాంతి కలిగించే విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్, విజయవాడతో సహా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్న ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు తమ వద్ద శిక్షణ పొందుతున్న యువతను రెచ్చగొట్టి ఈ అల్లర్లకు ప్రోత్సహించినట్లు కనుగొన్నారు. వారిలో ముందుగా సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు పేరు బయటకు వచ్చింది.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ వలన శిక్షణ పొందుతున్న యువతకు తీవ్రంగా నష్టపోతారని కనుక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నిరసనలు తెలిపేందుకు వస్తున్న ఆయనకు సంఘీభావం తెలిపేందుకు భారీగా యువకులు తరలిరావాలని కోరుతూ వాట్సాప్ గ్రూపులలో పంపిన సందేశాలను పోలీసులు గుర్తించారు.
ఈ అల్లర్లలో పాల్గొనే విద్యార్దులకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన యువకులకు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు పులిహోర, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు అందించినట్లు పోలీసులు కనుగొన్నారు.
ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో ఓ యువకుడి ఫోన్ సంభాషణ ప్రసారం అయ్యింది. దానిలో అతను “మనం బ్యానర్లు పట్టుకొని గొంతు చించుకొని ఎంతసేపు నినాదాలు చేసినా ప్రయోజనం ఉండదు. పెట్రోల్ తెచ్చి రెండు రైళ్ళు తగలబెడితే వెంటనే ఆ న్యూస్ బయటకు వెళుతుంది. నేను పెట్రోల్ తెచ్చుకొనేందుకు బంకుకి వెళుతున్నాను. ఎవరికైనా పెట్రోల్ కావాలంటే రండి,” అని ఆ యువకుడు అన్నాడు.
పోలీసులు అరెస్ట్ చేసిన యువకుల ఫోన్లు స్వాధీనం చేసుకొని ఈ అల్లర్ల వెనుక ఇంకా ఎంత మంది సూత్రధారులు ఉన్నారో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.