ఈరోజు రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మాజీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకోబోతే పంజగుట్ట ఎస్సై ఉపేంద్రబాబు చొక్కా కాలర్ పట్టుకొని దుర్భాషలాడారు. ఆమె ఎస్సై కాలర్ పట్టుకొని దుర్భాషలాడుతున్న ఫోటోలు, వీడియో మీడియాలో వైరల్ అయ్యాయి. ఎస్సై ఉపేంద్రబాబు ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు రేణుకా చౌదరిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై రేణుకా చౌదరి లౌక్యంగా తప్పించుకొనే ప్రయత్నం చేయడం విశేషం. తనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆమె స్పందిస్తూ, “నాకు పోలీసులు అంటే చాలా గౌరవం ఉంది. ఆ సమయంలో నా వెనుక ఉన్నవారు తోసినప్పుడు నేను తూలి కింద పడబోయాను. అప్పుడు ఎదురుగా ఉన్న ఎస్సీ ఉపేంద్రబాబు భుజం పట్టుకొన్నాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. అయినా ఒక మహిళనైన నా చుట్టూ మగ పోలీసులు ఎందుకు ఉన్నారో చెప్పాలి,” అని అన్నారు.
ఆమె ఈవిదంగా సర్ది చెప్పుకోవడం కంటే ‘ఆ సమయంలో నేను ఆవేశంగా ఎస్సై కాలరు పట్టుకొన్నాను. జరిగినదానికి చింతిస్తున్నాను,” అని చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ మహిళా పోలీసులతో కూడా చాలా దురుసుగా ప్రవర్తించి నాకు పోలీసులు అంటే చాలా గౌరవం,” అని చెప్పడం చూస్తే ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని అర్దమవుతోంది.
ఆమె పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ దృశ్యాలను మీడియా రికార్డ్ చేసింది కనుక వాటి ఆధారంగా పోలీసులు ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోగలిగితే మళ్ళీ ఏ నాయకుడు పోలీసుల పట్ల ఈవిదంగా చులకనగా ప్రవర్తించే సాహసం చేయడు.