ఎస్సై కాలర్ పట్టుకొని దుర్బాషలాడిన రేణుకా చౌదరి

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారిస్తుండటాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ రాజ్‌భవన్‌ ముట్టడికి ప్రయత్నించడంతో నగరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

మాజీ ఎంపీ రేణుకా చౌదరి పోలీసు బారికేడ్లను తొలగించి రాజ్‌భవన్‌ వైపు దూసుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకొన్నారు. అప్పుడు ఆమె వారిని ఉద్దేశ్యించి చాలా అనుచితంగా మాట్లాడారు. అయినా పోలీసులు సంయనం కోల్పోకుండా ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. 

మహిళా పోలీసులు ఆమెను వ్యానులో ఎక్కాలని కోరగా ఆమె వారితో చాలా దురుసుగా వ్యవహరించారు. “నా గురించి మీకు తెలీదు ఒక్కొక్కరినీ పోలీస్‌స్టేషన్‌లోనే కొడతాను జాగ్రత్త!” అంటూ వారిని బెదిరించారు. ఆమెకు నచ్చజెప్పడానికి వచ్చిన ఎస్ఐ కలరు పట్టుకొని “ఏరా నన్ను ఏమనుకొంటున్నావురా... నా కొడకా..” అంటూ చాలా అనుచితంగా దుర్భాషలాడారు. 

“మమ్మల్ని కాదు అక్కడ అసెంబ్లీలో కూర్చోన్న దొంగలను పట్టుకోండి దమ్ముంటే...” అంటూ శాసనసభ్యులను కించపరుస్తూ చాలా అసభ్యపదజాలంతో దూషిస్తూ మాట్లాడారు. అయినప్పటికీ పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తూ ఆమెను వ్యానులో కూర్చోవలసిందిగా పదేపదే అభ్యర్ధించగా చివరికి వారిని కరుణిస్తున్నట్లు, “నేను నా కారులోనే పోలీస్‌స్టేషన్‌కు వస్తానంటూ” రేణుకా చౌదరి మొండికేయడంతో పోలీసులు సహనం కోల్పోయారు. ఆమెను మహిళా పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించారు. అయితే ఆమె లోపల కూర్చోకుండా రెండు కాళ్ళు బయటపెట్టి కూర్చోవడంతో పోలీసులు ఆమెను అలాగే జీపులో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించినందుకు, డ్యూటీలో ఉన్న తమను దుర్భాషలాడినందుకు, ఎస్సై, మహిళా పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించినందుకు, ఈ గొడవతో సంబందం లేని ఎమ్మెల్యేలను కించపరుస్తూ మాట్లాడినందుకు పోలీసులు పలు సెక్షన్స్ కింద ఆమెపై కేసు నమోదు చేయనున్నారు.