కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారిస్తుండటాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈరోజు వేలాదిగా కాంగ్రెస్ శ్రేణులు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించి వారిని అరెస్ట్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ శ్రేణులు వెనక్కు తగ్గకపోవడంతో కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్ళే మార్గాలలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడంతో వారిని తోసుకొని లోపలకి పోయేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదాలకి దిగి వారిని దుర్భాషలాడారు.
ఖైరతాబాద్ జంక్షన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయి ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టి, అక్కడే ఉన్న ఓ బైకుకి నిప్పు పెట్టారు. తరువాత ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నానా హంగామా చేశారు. వారిని అదుపులో తీసుకొనే ప్రయత్నంలో పోలీసులకు, వారికి మద్య తోపులాటలు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి దొరికినవారిని దొరికినట్లు వ్యానులో ఎక్కించి ఘోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, గీతారెడ్డి, సునీతారావు, బోసురాజు, మహేష్ కుమార్, శ్రీనివాస్ కృష్ణన్ తదితర కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌వైపు వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని ఎక్కడికక్కడ బలవంతంగా వ్యానులలో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ చేసిన ఈ హడావుడితో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో యుద్ధ వాతావరణం ఏర్పడింది.
కాంగ్రెస్ నేతలు పోలీసుల పట్ల చాలా దురుసుగా వ్యవహరించినందుకు వారిపై కటినమైన సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది.