రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించలేకపోయిన విపక్షాలు

బుదవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వివిద పార్టీల నేతలు తమ రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించలేకపోయాయి. ఈ సమావేశానికి అధ్యక్షఠ వహించిన పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ అధినేత శరత్ పవర్ పేరును ప్రతిపాదించగా ఆయనే సున్నితంగా తిరస్కరించారు.

ఆ తరువాత మహాత్మా గాంధీజీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్లను ప్రతిపాదించారు. అయితే రాష్ట్రపతి అభ్యర్ధిపై మరికొంత కసరత్తు చేసిన తరువాత ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కనుక ఈ బాధ్యతను శరత్ పవర్, సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేలకు అప్పగించారు. మళ్ళీ ఈ నెల 20 లేదా 21వ తేదీలలో ఢిల్లీ లేదా ముంబైలో మరోసారి అందరూ సమావేశమయ్యి బిజెపియేతర రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించాలని నిర్ణయించారు. 

అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మమతా బెనర్జీ ఆహ్వానించినవారిలో అతిముఖ్యులైన ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్ రెడ్డి, ఉద్ధవ్ థాక్రే, అరవింద్‌  కేజ్రీవాల్‌, భగవంత్ సింగ్‌ మాన్‌, హేమంత్ సొరేన్, నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, ఎంకే స్టాలిన్‌ హాజరుకాలేదు. వారిలో కొందరు కాంగ్రెస్ పార్టీని ఈ సమావేశానికి ఆహ్వానించినందున రాకపోగా, మరికొందరు ఇతర కారణాల చేత హాజరుకాలేదు. 

ఈ సమావేశంలో పిడిపి, టిఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, శివసేన, సిపిఐ (ఎం), సిపిఐ (ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్, జెడి(ఎస్), ఆర్‌ఎస్పీ, ఆర్‌ఎల్డీ, జెఎంఎం, ఐయుఎంఎల్ పార్టీలు పాల్గొన్నాయి. తద్వారా తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగాలనుకొంటున్నట్లు స్పష్టం చేశాయి.