
పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నేతృత్వంలో నేడు ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశానికి సిఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. త్వరలో జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి పోటీగా బిజెపియేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని భావిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు ఈరోజు ఢిల్లీలోని కానిస్టిట్ట్యూషనల్ క్లబ్‌లో సమావేశానికి రావాలని ఆహ్వానిస్తూ మమతా బెనర్జీ సిఎం కేసీఆర్‌తో సహా వివిద రాష్ట్రాలకు చెందిన 8 మంది ముఖ్యమంత్రులకు, దేశంలో 22 పార్టీల అధినేతలకు లేఖలు వ్రాశారు. వారిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఉన్నారు.
జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్, బిజెపిలకు సమానదూరం పాటించాలని సిఎం కేసీఆర్ భావిస్తున్న సంగతి తెలిసిందే. కనుక కాంగ్రెస్ ప్రతినిధులు హాజరవుతున్న ఈ సమావేశానికి వెళ్ళాలా వద్దా అనే అంశంపై నిన్న ప్రగతి భవన్‌లో కొందరు ముఖ్యనేతలతో చర్చించినపుడు, వెళ్ళకపోవడమే మంచిదని నిర్ణయించుకొన్నారు. అయితే రాష్ట్రపతి ఎన్నికలో విపక్ష అభ్యర్ధికి మద్దతు ఇస్తామా లేదా అనేది తరువాత ప్రకటిస్తామని టిఆర్ఎస్ తెలియజేసింది.