కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్ ఎన్నికల ప్రక్రియలో కొన్ని మార్పులు సూచిస్తూ కేంద్ర న్యాయశాఖకు ఓ లేఖ వ్రాశారు. దీని కోసం ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 33(7)ని సవరణ చేయాలి. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే ఇకపై జరుగబోయే ఎన్నికలలో ఒక అభ్యర్ధి ఏదో ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయవలసి ఉంటుంది.
కొన్ని పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్న కొన్ని మీడియా సంస్థలు ప్రకటిస్తున్న ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నందున, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకు వాటిని ప్రకటించకుండా కట్టడి చేయాలని రాజీవ్ కుమార్ మరో ప్రతిపాదన చేశారు.
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న బోగస్ ఓటర్లను కట్టడి చేసేందుకుగాను ఓటర్ కార్డును తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం చేయాలి. అలాగే ఏడాదికి నాలుగు కటాఫ్ తేదీలతో ఓటర్లు నమోదుకు అవకాశం కల్పించాలి.
ఎన్నికల కమీషన్‌కు రాజకీయపార్టీలను రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉన్నట్లే, వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం కూడా కలిగి ఉండాలి.
రాజకీయ పార్టీలు రూ.2,000 మించి విరాళాలను తప్పనిసరిగా ఎన్నికల కమీషన్‌కు తెలియజేయాలి.