
ఏపీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ఆదివారం సిఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సుదీర్గంగా భేటీ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సమావేశంలో వారిరువురు ఏమి చర్చించారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉండవల్లి స్వయంగా తమ సమావేశం గురించి నిన్న మీడియాకు వివరించారు.
“సిఎం కేసీఆర్ ప్రధానంగా జాతీయ స్థాయిలో బిజెపిని ఏవిదంగా ఎదుర్కొని కట్టడి చేయాలనే దానిపైనే ఎక్కువ మాట్లాడారు. బిజెపి చేస్తున్న మత రాజకీయాల వలన దేశ ప్రజల మద్య చిచ్చు రగులుతోంది. అలాగే మహమ్మద్ ప్రవక్తపై బిజెపి నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల వలన అరబ్ దేశాలు మన దేశంపై ఆగ్రహంతో ఉన్నాయి. వాటికి కేంద్రప్రభుత్వం ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పుకొన్నప్పటికీ జరగకూడని నష్టం జరిగింది.
ఈవిదంగా మత రాజకీయాలతో ముందుకు సాగుతుంటే మున్ముందు భారత్ పరిస్థితి ఏమిటి? కనుక బిజెపిని అడ్డుకోవలసిన అవసరం ఉందని సిఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు అడ్డుకోకపోతే మున్ముందు బిజెపి మరింత బలపడి దాని వైపు ఎవరూ కన్నెత్తి చూడలేని పరిస్థితి వస్తుందని సిఎం కేసీఆర్ అన్నారు. బిజెపికి ఏవిదంగా అడ్డుకట్టవేయాలో సిఎం కేసీఆర్‌కి పూర్తి క్లారిటీ ఉంది.
దేశంలో మమతా బెనర్జీ, కేసీఆర్ మాత్రమే బిజెపికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్నారు. మిగిలిన ముఖ్యమంత్రులు తమ రాజకీయ అవసరాలు లేదా కేసులకు భయపడి నోరు మెదపడం లేదు. జాతీయ సమస్యలు, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌కి ఉన్న స్పష్టత చూసి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. ఆయన ఒక్కరికే బిజెపిని ఎదిరించే దమ్ము ధైర్యం ఉన్నాయని నేను భావిస్తున్నాను. త్వరలోనే మళ్ళీ మరోసారి సమావేశం అవుదామని సిఎం కేసీఆర్ చెప్పారు,” అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.