
తెలంగాణ సిఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యి, రాష్ట్రపతి ఎన్నికల గురించి, భారత్ రాష్ట్రీయ సమితి పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించడంపై సుదీర్గంగా చర్చించారు.
రాష్ట్రపతి ఎన్నికలపై బిజెపికి పోటీగా అభ్యర్ధిని నిలబెట్టేందుకు ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాలని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఆహ్వానించడంపై ముందుగా వారు చర్చించారు. ఆ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించినప్పటికీ, స్వయంగా కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ హాజరవడం మంచిదని నిర్ణయించారు. జాతీయ రాజకీయాలలో ప్రవేశించే ముందే రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపిని ఢీకొన్నట్లయితే దాంతో దేశ ప్రజలకు బలమైన సందేశం ఇచ్చినట్లవుతుందని ప్రశాంత్ కిషోర్ సూచించగా సిఎం కేసీఆర్ కూడా ఆయనతో ఏకీభవించారు.
ఆ తరువాత జాతీయ పార్టీ ఏర్పాటుపై కూడా వారిరువురూ సుదీర్గంగా చర్చించారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడి బిజెపిని ఎదుర్కోలేకపోతోంది. బలమైన ప్రత్యామ్నాయ లేకపోవడంతో బిజెపి కూడా చెలరేగిపోతూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. వామపక్షాల సిద్దాంతాలకు, వాటి భావజాలానికి దేశంలో ఆదరణ లేదు. కనుక కొత్త పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని సిఎం కేసీఆర్ వాదనతో ప్రశాంత్ కిషోర్ ఏకీభవించినట్లు తెలుస్తోంది. అయితే వివిద రాష్ట్రాలలో కాంగ్రెస్, బిజెపియేతర ప్రాంతీయ పార్టీలను ఏవిదంగా కలుపుకుపోవాలనే దానిపై వారిరువురూ చర్చించారు.
ప్రశాంత్ కిషోర్‌తో భేటీ తరువాత ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్‌తో సిఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో భేటీ కావడం విశేషం. ఆయనతో ప్రధానంగా భారత్ రాష్ట్రీయ సమితి పార్టీ ఏర్పాటులో సాంకేతిక అంశాలు, ఒకవేళ ఆ పార్టీని స్థాపిస్తే టిఆర్ఎస్ పార్టీని దానిలో విలీనం చేయాలా లేక వేరే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా?అనే అంశంపై వారిరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.