
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఖమ్మం కూడా ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం రూ.11.75 కోట్లు వ్యయంతో లకారం చెరువుపై నిర్మించిన కేబిల్ బ్రిడ్జి, మ్యూజికల్ ఫౌంటెయిన్లను మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ప్రారంభోత్సవం చేశారు. తరువాత రఘునాధపాలెంలో రూ.2 కోట్లు వ్యయంతో నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని, ప్రకృతి వనాన్ని కూడా మంత్రులు ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, “ఒకప్పుడు లకారం చెరువు మురికినీళ్ళతో దుర్వాసన వస్తుండేది. ఎవరూ ఈ చుట్టుపక్కలకు వచ్చేవారు కాదు. కానీ లకారం చెరువుని శుభ్రపరిచి, సుందరీకరణ చేసి మ్యూజికల్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేసి చెరువుపై కేబిల్ బ్రిడ్జి కూడా నిర్మించడంతో ఇప్పుడు వీటిని చూసేందుకు రోజూ అనేకమంది వస్తున్నారు.
ఒకప్పటి ఖమ్మం నగరానికి ఇప్పటి ఖమ్మం నగరానికి తేడా మీరందరూ చూస్తూనే ఉన్నారు. దీనికంతటికీ కారణం నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలనే మంత్రి పువ్వాడ తపన, పట్టుదలే కారణం. కానీ ఎవరో ఏదో చేసుకొంటే దానికీ ఆయనే బాధ్యుడు అంటూ బిజెపి నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
దేశంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొడుతున్నది బిజెపి నేతలే. వారు చేసిన పనికి ఇప్పుడు దేశంలో ముస్లింలు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో మన పక్కవాడిని కూడా అనుమానంగా చూడాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది.
దేశంలో ప్రజలకు ఏమి కావాలో అవి ప్రభుత్వాలు సమకూర్చాలి. ఇళ్ళు లేనివారికి ఇళ్ళు, నీళ్ళు, విద్యుత్, ఉద్యోగాలు లేని వారికి అవి సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. కానీ వీటి గురించి ఆలోచించకుండా అధికారంలో ఉన్న కొని పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసం కులం, మతం పేరుతో ప్రజల మద్య చిచ్చు రగిలిస్తున్నాయి. దీంతో ప్రశాంతంగా ఉన్న దేశంలో అగ్గి రాజేస్తున్నారు. దీనిని అందరూ ఖండించాలి. అభివృద్ధిని పట్టించుకోని అటువంటి రాజకీయ నాయకులను ప్రజలు దూరంగా ఉంచాలి,” అని అన్నారు.