తెలంగాణ సిఎం కేసీఆర్ త్వరలో జాతీయస్థాయి పార్టీ స్థాపించబోతున్నారనే వార్తలపై రాష్ట్ర బిజెపి ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఈరోజు ఢిల్లీలో స్పందిస్తూ, “హైదరాబాద్ నడిబొడ్డున ఓ ప్రభుత్వ వాహనంలో ఓ మైనర్ బాలికపై టిఆర్ఎస్కు మిత్రపక్ష పార్టీ నేతల కుమారులు సామూహిక అత్యాచారం చేయడం సిగ్గుచేటు. ఈ కేసును ఏదో విదంగా పక్కదారి పట్టించి వారిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించడం ఇంకా సిగ్గుచేటు.
నగరంలో పబ్బులలో మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. బంగారి తెలంగాణ చేసి చూపిస్తానంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించలేని తెలంగాణ సిఎం కేసీఆర్, వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు బయలుదేరిందన్నట్లు జాతీయపార్టీతో దేశాన్ని ఉద్దరిస్తానని బయలుదేరుతుండటం చాలా హాస్యస్పదంగా ఉంది. రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే కేసీఆర్ ఈ జాతీయపార్టీ పేరుతో కొత్త డ్రామా మొదలుపెడుతున్నారని మేము భావిస్తున్నాము.
తెలంగాణలో సమస్యలు పరిష్కరించలేకపోతున్న సిఎం కేసీఆర్ దేశంలో సమస్యలను ఏవిదంగా పరిష్కరించగలరు?ఆయన జాతీయ పార్టీ పెట్టుకొంటానంటే ఎవరికీ అభ్యంతరం లేదు. దేశంలో వేలాది పార్టీలు ఉన్నాయి. దానిలో ఇది మరొకటి అవుతుంది అంతే!,” అని అన్నారు.