జాతీయ పార్టీ స్థాపనకే కేసీఆర్‌ మొగ్గు

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్దరాత్రి వరకు ప్రగతి భవన్‌లో సుదీర్గంగా మంత్రులు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. 

బీజేపీని ఎదుర్కొనేందుకు రాష్ట్రపతి ఎన్నికలే తొలి అవకాశమని సమావేశంలో అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కనుక ఎన్డీయే అభ్యర్ధికి పోటీగా ఉమ్మడి అభ్యర్ధిని బరిలో దింపడానికి గట్టి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.    

తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు , సంక్షేమ పధకాల గురించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో చర్చ జరుగుతోంది కనుక కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేయడం కంటే సొంతంగా జాతీయస్థాయి పార్టీ ఏర్పాటు చేసుకోవడమే మంచిదనే అభిప్రాయం సిఎం కేసీఆర్‌ వ్యక్తం చేశారు. తద్వారా మన పార్టీయే ఆయా రాష్ట్రాలలో కూడా వీటిని అమలుచేసి అభివృద్ధి చేయగలదనే నమ్మకం ప్రజలలో కల్పించగలుగుతామని సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. 

కనుక భారత్‌ రాష్ట్రీయ సమితి అనే పేరుతో జాతీయ పార్టీని స్థాపించి ముందుకు సాగుదామని సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే జూన్‌ 19న టిఆర్ఎస్‌ టిఆర్ఎస్‌ రాష్ట్ర కారవర్గ సమావేశం నిర్వహించి దానిలో ఈ ప్రతిపాదనపై మరింత లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకొని అదే రోజున తమ కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించారు.

కేంద్రప్రభుత్వం సూచనల మేరకే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విదంగా వ్యవహరిస్తున్నారని కనుక ఇకపై ఆమెను మరింత ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.   

రాష్ట్రానికి రావలసిన నిధులు ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోందని, అలాగే దేశవ్యాప్తంగా బిజెపి ఆగడాలు పెరిగిపోయాయని కనుక బిజెపిని ధీటుగా ఎదుర్కోవలసిన అవసరం ఉందని సమావేశంలో అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రాష్ట్రంలో చిన్న చిన్న సమస్యలపై కూడా కాంగ్రెస్, బిజెపిలు రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నాయని, జూబ్లీహిల్స్‌ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు చురుకుగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తుండటమే ఇందుకు నిదర్శనమని సమావేశంలో అందరూ అభిప్రాయపడ్డారు.