గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు రాజ్‌భవన్‌లో మహిళలతో మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. మహిళా దర్బారులో పాల్గొన దలచిన మహిళలు రాజ్‌భవన్‌కు చెందిన 040-23310521 నంబరుకి ఫోన్ చేసి లేదా rajbhavanhyd.gov.in కు ఈ మెయిల్ ద్వారా అనుమతి పొందవచ్చు.
గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో మహిళా దర్బారు నిర్వహించడం ద్వారా తన హద్దులు దాటుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఓ వైపు బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయంగా దాడి చేస్తుంటే, మరోపక్క గవర్నర్ తమిళిసై ప్రజా దర్బార్ నిర్వహిస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు వ్యవహరించడం సరికాదని నారాయణ అన్నారు. కనుక రేపు నిర్వహించబోయే మహిళా దర్బారును గవర్నర్ తక్షణం రద్దు చేసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.
నగరంలో అత్యాచార కేసులపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని, పోలీసులను నిలదీస్తూ ఆందోళనలు చేస్తున్న ఈ సమయంలో గవర్నర్ తమిళిసై మహిళల సమస్యల గురించి తెలుసుకొనేందుకు రేపు రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహిస్తుండటం వలన ఆమెకు, తెలంగాణ ప్రభుత్వానికి మద్య దూరం ఎలాగూ మరింత పెరుగుతుంది.
ఒకవేళ రేపటి మహిళా దర్బారులో పాల్గొనే మహిళలు ఏవైనా కొత్త సమస్యలు బయటపెట్టిన్నట్లయితే అవి రాజ్‌భవన్-తెలంగాణ ప్రభుత్వం మద్య కొత్త సమస్యలకు బీజం వేసినట్లవుతుంది. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ ఈ మహిళా దర్బారుపై స్పందించలేదు.