జూబ్లీహిల్స్‌ బాలిక రేప్ కేసుపై వర్మ కామెంట్స్

జూబ్లీహిల్స్‌ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసుపై వివాదాల రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. “ఓ సాధారణ పౌరుడిగా నేను ఏమనుకొంటునాన్నంటే ఈ కేసులో బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక్కరే నిజాయితీగా మాట్లాడుతున్నారు. మిగిలిన వారందరూ ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.. చాలా బాధాకరం!” అని ట్వీట్ చేశారు. 

ఈ కేసుపై టిఆర్ఎస్‌, మజ్లీస్‌ నేతలెవరూ ఇంతవరకు బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ పోలీసులపై వారి ఒత్తిళ్ళు ఉంటాయనేది బహిరంగ రహస్యం. కనుక ఈ కేసులో రఘునందన్ రావు నిందితుల ఫోటో, వీడియో రిలీజ్ చేసినందుకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినప్పటికీ, అప్పటి నుంచే పోలీసులపై ఒత్తిడి పెరిగి కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసును కాంగ్రెస్ నేతలు తమ ఉనికిని చాటుకొనేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే భావించి ఓరోజు హడావుడి చేసి ఊరుకొన్నారే తప్ప ఎవరూ రఘునందన్ రావులా పోరాడటం లేదు. 

ఈ కేసులో రిమాండ్‌పై ప్రస్తుతం జైలులో ఉన్న ఐదుగురు నిందితుల తరపున వారి న్యాయవాదులు కోర్టులో బెయిల్‌ పిటిషన్లు కూడా వేశారు. వారందరూ ప్రముఖుల పిల్లలు కనుక నేడో రేపో వారు బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చేసినా ఆశ్చర్యం లేదు. క్రమంగా ఈ కేసు అటకెక్కిపోయినా ఆశ్చర్యం లేదు. కనుక వృత్తిరీత్యా న్యాయవాది అయిన రఘునందన్ రావు బాధితురాలికి న్యాయం జరిగేవరకు న్యాయపోరాటం చేయడానికి సిద్దం అవుతున్నారు.