తెలంగాణలో మరో 40 నియోజకవర్గాలలో సర్వే పూర్తి?

వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ పార్టీకి బిజెపి నుంచి గట్టి పోటీ ఉండబోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తుండటంతో సిఎం కేసీఆర్‌ ఇప్పటి నుంచే పార్టీపై దృష్టి పెట్టారు. దానిలో భాగంగా ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌కి చెందిన ఐప్యాక్ (ఇండియన్ పోలిటికల్ యాక్షన్ కమిటీ) సంస్థ ద్వారా రాష్ట్రంలో సర్వేలు చేయిస్తున్నారు. 

ఆ సంస్థ ఇప్పటికే 70 నియోజకవర్గాలలో సర్వే పూర్తిచేసింది. ఆ నివేదికను ప్రశాంత్ కిషోర్‌ స్వయంగా సిఎం కేసీఆర్‌కు స్వయంగా అందజేశారు. ఈ నెలాఖరులోగా మరో 40 నియోజకవర్గాలలో కూడా సర్వే పూర్తి చేసి సిఎం కేసీఆర్‌కు నివేదిక అందించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సర్వేలో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరు, సమర్దత, ప్రజలతో, మీడియాతో వారి సంబంధాలు, ప్రజాధారణ తదితర అంశాలతో పాటు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో ప్రభుత్వం పనితీరుపై వస్తున్న వార్తలు, విశ్లేషణలు, ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వార్తలు, వాటిపై టిఆర్ఎస్‌ నేతలు స్పందిస్తున్న తీరు తదితర అంశాలపై కూడా ప్రశాంత్ కిషోర్‌ బృందం లోతుగా సర్వే చేస్తున్నట్లు సమాచారం. 

అలాగే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వాటి వెనుక ఉన్న అసలు నేతలు, పార్టీలో వారి ప్రభావం, ప్రాధాన్యత, ప్రత్యర్ధి పార్టీల బలాబలాలు తదితర అంశాలపై కూడా ఐప్యాక్ సంస్థ సర్వే చేస్తున్నట్లు సమాచారం.   

ఇప్పటి వరకు సమర్పించిన నివేదికల ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 40 మంది పనితీరు బాగోలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. బహుశః అందుకే జరిగిన టిఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరుచుకోవాలని సిఎం కేసీఆర్‌ హెచ్చరించి ఉండొచ్చు.