గ్రేటర్ బిజెపి కార్పొరేటర్లతో ప్రధాని మోడీ భేటీ

జీహెచ్‌ఎంసీ బిజెపి కార్పొరేటర్లతో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారందరినీ పేరుపేరునా పలకరించి వారి, వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకొన్నారు. 

వారు కార్పొరేటర్లే అయినప్పటికీ ఎమ్మెల్యేల స్థాయిలో కష్టపడి పనిచేయాలని మోడీ వారికి సూచించారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ పార్టీని ఓడించి బిజెపి అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ వారందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ భేటీలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

దేశంలో మరే రాష్ట్ర కార్పొరేటర్లను ప్రధాని నరేంద్రమోడీ ఈవిదంగా తన నివాసానికి ఆహ్వానించి భేటీ అవ్వలేదు. తొలిసారిగా గ్రేటర్ హైదరాబాద్‌ కార్పొరేటర్లను ఆహ్వానించడం గమనిస్తే తెలంగాణ అధికారంలోకి వచ్చేందుకు బిజెపి ఎంత పట్టుదలగా ఉందో అర్ధం అవుతోంది. అయితే బిజెపి కార్పొరేటర్లలో కొందరు పార్టీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. బహుశః అది కూడా ఈ సమావేశానికి ఓ కారణమై ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ ప్రధాని నరేంద్రమోడీతో ఈ సమావేశం తరువాత వారిలో నూతనోత్సాహంతో పనిచేయడం ఖాయమనే భావించవచ్చు.