
దేశంలో ఇప్పుడు ప్రతీ పౌరుడుకి ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ నిర్వహించాలన్నా, సిమ్ కార్డు, గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా, అవి కలిగి ఉండాలన్నా, ఆర్ధిక లావాదేవీలు నిర్వహించుకోవాలన్నా, చివరికి ఆన్‌లైన్‌లో రైలు, బస్సు, విమాన టికెట్స్ కొనుగోలు చేయాలన్నా ఆధార్ తప్పనిసరైపోయింది.
అయితే ఒక్కోసారి ఆధార్ కార్డులో వివరాలను మార్చుకోవలసి రావచ్చు లేదా అప్‌డేట్ చేసుకోవలసి రావచ్చు. అటువంటప్పుడు అన్ని పనులు మానుకొని ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్ళి గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడక తప్పదు.
ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సిబ్బందిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. వారికి అవసరమైన శిక్షణ, ల్యాప్ టాప్ లేదా టాబ్స్ ఇచ్చి వాటితో ప్రజల ఇళ్ళవద్దనే ఆధార్ సేవలు అందించాలని నిర్ణయించింది. దీని కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా 4,000 మంది పోస్టుమ్యాన్‌లకు శిక్షణ ఇస్తోంది కూడా. వారి ద్వారా దేశంలో మారుమూల గ్రామాలలో నివసించే ప్రజలకు కూడా ఆధార్ కార్డులు అందుబాటులోకి వస్తాయి. వీరిని నియమించుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా జిల్లా, పట్టణ స్థాయిలో మరిన్ని ఆధార్ సేవా కేంద్రాలను కూడా ప్రారంభించాలని నిర్ణయించింది.