
హైదరాబాద్‌లో మైనర్ బాలిక అత్యాచార కేసులో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తుంటే దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాకు నిందితుల ఫోటో, వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచే పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగి కేసు దర్యాప్తు వేగవంతం చేసారు.
అయితే సెక్షన్ 228 (ఏ) ప్రకారం హత్య, అత్యాచార కేసులలో బాధితురాలు, మైనర్ల ఫోటోలు, వీడియో, పేరు వివరాలను బయటపెట్టకూడదు. కనుక ఆ సెక్షన్ కింద ఆయనపై అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఓ కేసు నమోదు చేశారు.
అయితే ఆ ఫోటో, వీడియోను విడుదల చేస్తున్నప్పుడేరఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసు కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ, దిశ కేసుల వంటిదే. అయితే దీనిలో కొందరి ప్రముఖుల పిల్లలు నిందితులుగా ఉన్నందున వారిని కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టక మునుపే హోంమంత్రి మనుమడికి క్లీన్ చిట్ ఇచ్చేయడం, గత నెల 28న అత్యాచారం జరిగితే ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ కేసులో వారు నిందితులని చెప్పేందుకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు చెపుతున్నారు కనుకనే వారి ఫోటో, వీడియోని విడుదల చేస్తున్నాను. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఫోటోలో, వీడియోలో ఎక్కడా బాధితురాలి మొహం కనబడకుండా కేవలం నిందితులను మాత్రమే చూపాము. మా వద్ద ఇంకా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. అవసరమైతే నేనే స్వయంగా డిజిపి మహేందర్ రెడ్డిని కలిసి వాటిని అందించడానికి సిద్దంగా ఉన్నాను,” అని చెప్పారు.