ప్రధాని నరేంద్రమోడీ జీహెచ్‌ఎంసీలో బిజెపి కార్పొరేటర్లను ఢిల్లీకి ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు వారితో ఆయన సమావేశం కానున్నారు. వారితో పాటు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఆజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, గ్రేటర్ పరిధిలో అర్బన్ జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కనుక రేపు ఉదయం బిజెపి కార్పొరేటర్లు ఢిల్లీకి విమానంలో బయలుదేరుతారు. గ్రేటర్ పరిధి చాలా విస్తరించి ఉన్నందున కార్పొరేటర్లను కూడా పార్టీ బలోపేతం చేసేందుకు ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వారితో భేటీ అయ్యేందుకు ఢిల్లీకీ ఆహ్వానించారు.
ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా కార్పొరేటర్లను ఢిల్లీకి ఆహ్వానించడం, జూలై 2,3 తేదీలలో హైదరాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుండటం వంటివన్నీ తెలంగాణ రాష్ట్రంపై బిజెపి అధినాయకత్వం పూర్తి దృష్టి పెట్టిందని స్పష్టం చేస్తున్నాయి. రాబోయే ఏడాదిన్నరలో బిజెపి మరింత ఉదృతంగా రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించవచ్చు. కనుక వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి బిజెపి నుంచి గట్టి పోటీ తప్పదని స్పష్టం అవుతోంది. అయితే వచ్చే ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కేసీఆర్ భావిస్తుంటే, రాష్ట్రంలో ఆయనను గద్దె దింపాలని బిజెపి ప్రయత్నిస్తుండటం విశేషం.