ధనిక రాష్ట్రమైనా అప్పుల తిప్పలు?

తెలంగాణ ధనిక రాష్ట్రమని సిఎం కేసీఆర్‌ మొదలు ఎమ్మెల్యేలవరకు అందరూ గొప్పగా చెప్పుకొంటుంటారు. కానీ మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు తెచ్చుకొంటూనే ఉంటుంది. ధనిక రాష్ట్రమైనప్పుడు అప్పు చేయవలసిన అవసరం ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తుంటే, సిఎం కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అయితే రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాల కొరకే అప్పులు తెస్తున్నందున వాటిని పెట్టుబడులుగానే భావించాలని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తుంటారు. 

అయితే గత రెండు నెలలుగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయడానికి కేంద్రం అనుమతించకపోవడంతో ఈ నెల జీతాల చెల్లింపు కూడా ఆలస్యమైంది. అంటే అప్పు చేయకపోతే ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉండనుకోవాలా? 

దమ్ముంటే దళిత బంధు పధకాన్ని బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలుచేసి చూపాలని సవాలు విసురుతున్న టిఆర్ఎస్‌ మంత్రులు, రూ.4,000 కోట్ల అప్పు పుట్టడం ఆలస్యమైతే తమ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఎందుకు ఉంటోంది? అనే ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 

రాష్ట్రంలో కార్పొరేషన్లు గత రెండేళ్ళుగా బడ్జెటేతర రుణాలు తీసుకొంటుండంపై కేంద్రప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసి వివరణలు కోరింది. వాటిపై తెలంగాణ ప్రభుత్వం వివరణలు ఇచ్చి రూ.53, 000 కోట్లు బాండ్ల రూపంలో రుణసేకరణ చేయాలనుకొంటే కేంద్రప్రభుత్వం గత రెండేళ్ళుగా అనుమతించలేదు. 

అయితే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబందించి వివరణలు ఇవ్వడంతో బాండ్ల వేలం ద్వారా రూ.4,000 కోట్లు సేకరించుకొనేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా విడుదల చేసింది. 

దానిలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలకు చెరో రూ.2,000 కోట్లు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ.4,000 కోట్లు బాండ్ల రూపంలో వేలం వేసుకొని రుణాలు సేకరించేందుకు అనుమతించింది. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకోబోయే రుణాలపై 13, 14 ఏళ్ళకు, తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే రుణాలకు 13 ఏళ్ళు కాలపరిమితితో కూడిన బాండ్స్ వేలం వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ఈ నెల 7వ తేదీన వాటి వేలం జరుగుతుంది.