ఇదిగో సాక్ష్యం.. ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేస్తారా?

జూబ్లీహిల్స్‌ అమ్నేషియా పబ్బు వద్ద ఓ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో మజ్లీస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నాడని తెలియజేసే ఓ ఫోటోను బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కొద్దిసేపటి క్రితం నాంపల్లి బిజెపి కార్యాలయంలో మీడియాకు విడుదల చేశారు. దాంతో పాటు కారులో అమ్మాయితో పాటు ఉన్న మరికొందరిని చూపిస్తూ ఉన్న ఓ చిన్న వీడియో క్లిప్పును కూడా విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ రేప్ కేసులో మజ్లీస్‌ ఎమ్మెల్యే కొడుకు లేడని వెస్ట్ జోన్ డీఎస్పీ దర్యాప్తు చేయక మునుపే తీర్పు చెప్పేశారు. నిందితులు పెద్ద కుటుంబాలకు చెందినవారు కనుక వారి ప్రతిష్టకు భంగం కలుగుతుందని, రేప్ చేసిన వారు మైనర్లు కనుక వారి పేర్లు బయటపెట్టలేమని డీఎస్పీ చెప్పడం చూస్తే వారిని కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు ఎంతగా తాపత్రయపడుతోందో అర్ధం అవుతోంది. వారు పెద్ద కుటుంబాలకు చెందినవారా... మైనర్లా...అనేది ముఖ్యం కాదు. వారు నేరం చేశారా లేదా? అనేది ముఖ్యం అని పోలీసులకి, ప్రభుత్వానికి తెలియదా?

నిన్న కేటీఆర్‌ ట్వీట్ చేయగానే పోలీసులు చాలా హడావుడి చేశారు. కానీ ఇంతవరకు కూడా దోషులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచ లేదు. అంటే ఇదంతా ప్రజలను మభ్యపెట్టి ఈ కేసులో నుంచి దోషులను తప్పించడానికి పోలీసులు, ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకమే అని భావించాలి. 

నిజానికి నగరంలో పోలీస్ వ్యవస్థ కేసీఆర్‌, కేటీఆర్‌, మహమూద్ అలీ చేతుల్లో లేదని నేను నిన్ననే చెప్పాను. పోలీస్ వ్యవస్థ అంతా మజ్లీస్ కనుసన్నలలో పనిచేస్తోంది. కనుక మజ్లీస్ నేతలు చెప్పినట్లుగానే నడుచుకొంటారు కనుక ఈ కేసులో నుంచి తమ పిల్లలని తప్పించాలని వారు పోలీసులపై ఒత్తిడి చేస్తుండటం వలననే ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కనీసం నేరస్తుల పేర్లు బయటపెట్టడానికి కూడా జంకుతున్నారు. 

ఈ కేసులో మజ్లీస్‌ ఎమ్మెల్యే కుమారుడు లేదని డీఎస్పీ చెప్పారు కానీ ఉన్నాడని తెలిపేందుకు నా వద్ద సాక్ష్యం ఉంది,” అంటూ, పోలీసులు స్వాధీనం చేసుకొన్న బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు బాలికను ముద్దు పెట్టుకొంటుండగా తీసిన ఓ ఫోటోను, వారితో పాటు కారులో ఉన్న మరో ముగ్గురినీ చూపించే ఓ చిన్న వీడియో క్లిప్పుని మీడియాకు చూపించారు. 

“ఇప్పుడు నేను సాక్ష్యం చూపాను కనుక ఇకనైనా ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేస్తారా లేదా?” అని రఘునందన్ రావు పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే వరకు బిజెపి పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని రఘునందన్ రావు అన్నారు.