
ఇప్పుడు రోజుకో లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటితో సమాజం తీరుతెన్నులలో కూడా చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు కుటుంబ గౌరవం, వంశ ప్రతిష్ట వంటివాటికి చాలా ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు తల్లితండ్రులకే గౌరవం లభించడం లేదు. ఇక అమ్మమ్మ, నాన్నమ్మ, తాత్తయ్యల పేర్లు తెలియనివారు కోకొల్లలు ఉన్నారు. ఇక కుటుంబ గౌరవం, వంశ ప్రతిష్ట గురించి ఏం పట్టించుకొంటారు?
కనుక ఎవరికి తోచినట్లు వారు బ్రతికేస్తున్నారు. ఆ విదంగా బ్రతుకుతూ అంతా సవ్యంగా సాగితె వారు అదృష్టవంతులే కానీ విచ్చలవిడితనం కారణంగా చిక్కులో పడితే లేదనుకొన్న పరువు తప్పక గుర్తుకు వస్తుంటుంది. హైదరాబాద్‌లో జరిగిన ఇటువంటి ఘటన ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
హైదరాబాద్‌లో ఓ యువతి రాజు అనే ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. కానీ వారి మద్య విభేధాలు రావడంతో బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. మళ్ళీ కొన్ని రోజుల తరువాత రాజు నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. దాంతో ఆమె కూడా మళ్ళీ ప్రేమగా మాట్లాడింది. కొన్ని రోజులు ఇద్దరూ ఫోన్లో ప్రేమ కబుర్లు చెప్పుకొన్న తరువాత ఓ రోజు అతను ఆమె అర్ధనగ్న ఫోటోలు పంపమని కోరాడు. ప్రియుడి కోరికను కాదనలేక ఆమె పంపింది!
మర్నాడు అతనిని కలుసుకొనేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతమైన శివారంపల్లికి వెళ్లింది. కానీ రాజుకి బదులు మహమ్మద్ మోహ్సీన్ (22) అనే వ్యక్తి ఆమెకు ఎదురయ్యాడు. తానే రాజు పేరుతో ఇన్ని రోజులుగా ఫోన్లో మాట్లాడుతున్నానని అతను చెప్పడంతో ఆమె షాక్ అయ్యింది. ఆమె కంగారుపడి అతనికి పంపిన తన ఫోటోలను ఫోన్‌లో నుంచి డిలీట్ చేయాలని బ్రతిమాలుకొంది. కానీ అతను డబ్బు డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించసాగాడు.
తన అర్ధనగ్న ఫోటోలు పంపించి పెద్ద పొరపాటు చేసినప్పటికీ ఆ అమ్మాయి కాస్త ధైర్యం చేసి షీ-టీంను ఆశ్రయించి తెలివైన పని చేసింది. వారు తక్షణం మహమ్మద్ మోహ్సీన్‌ను అరెస్ట్ చేసి మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. పోలీసులు అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసారు.
కానీ అతను ఆ ఫోటోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడని కోర్టులో నిరూపించవలసి ఉంటుంది కనుక ఆ ఫోటోలను వెంటనే చెరిపివేయడానికి వీలు లేదు! కేసు నమోదు అయ్యింది కనుక ఆమె కూడా ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరయ్యి ఆ ఫోటోలు తానే అతనికి పంపినట్లు చెప్పుకోవలసి ఉంటుంది!
వీటి వలన ఆమెకు ఎంత అవమానమో...ఆమె తల్లితండ్రులకు ఎంత తలవంపులో అర్ధం అవుతూనే ఉంది. కనుక యువత పొరపాటున కూడా ఇటువంటి పొరపాట్లు చేయకూడదని గ్రహించాలి.
ముఖ్యంగా అందరూ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. మన మొబైల్ ఫోన్లలో తీసుకొన్న ఫోటోలను మనం ఎవరికీ పంపకపోయినప్పటికీ, అవి క్లౌడ్ స్పేస్ లేదా గూగుల్ డ్రైవ్ లేదా వేరే చోట ఆటోమేటిక్‌గా భద్రపరచబడుతుంటాయి. కనుక మొబైల్, ట్యాబ్, ల్యాప్ టాప్‌లతో ఫోటోలు, వీడియోలు తీసుకొనేటప్పుడు అలాగే వాటిని భద్రపరిచేటప్పుడు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే వాటిని అందరికీ అందుబాటులో ఉంచినట్లే. అప్పుడు ఇంతకంటే పెద్ద చిక్కుల్లోనే పడే ప్రమాదం ఎప్పుడూ పక్కనే పొంచి ఉంటుంది. అని మరిచిపోకూడదు.
కనుక టెక్నాలజీని వాడేసుకోవడమే కాదు అగ్గిపుల్లవంటి దానితో జాగ్రత్తగా ఉండటం కూడా చాలా అవసరం అని మరిచిపోకూడదు.