.jpg)
ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన కేంద్రహోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నామని టిఆర్ఎస్ నేతలు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే కేంద్రానికి తెలంగాణకి అన్యాయం చేయవలసిన అవసరం ఏమిటి? రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతాము. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చాం. తెలంగాణ ప్రభుత్వం సహకరించి ఉండి ఉంటే రాష్ట్రానికి మరో లక్ష కోట్లు లభించేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం కేంద్రం పట్ల భిన్నంగా వ్యహరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆజాదీ కా అమృతోత్సవ్ జరిపేందుకు సహకరించలేదు.
మేము ఢిల్లీకి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా వారిని సాధారంగా ఆహ్వానించి రాష్ట్రానికి సంబందించిన అంశాలపై మాట్లాడి తెలుసుకొని అవసరమైన సహాయసహకారాలు అందిస్తూనే ఉంటాము. కానీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని, మంత్రులను అవమానిస్తోందని దుష్ప్రచారం చేయడం తగదు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లాభనష్టాలను లెక్కించుకొంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి పదేళ్ళు ఆలస్యం చేసింది. కానీ అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వంపై బిజెపి కూడా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసింది. అనేక ఏళ్ళ పోరాటాలు, బలిదానాలతో సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో భారత్ మాత నుదుట బొట్టుగా వెలిగిపోవాలని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు.