తెలంగాణ అవతరణ దినోత్సవం..ఎవరి పండగ వారిదే

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన సభకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఆహ్వానించలేదు. రాజ్‌భవన్‌లోలో ఈరోజు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు జరిగిన తెలంగాణ ఆష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సిఎం కేసీఆర్‌ హాజరుకాలేదు. 

కనుక గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో, సిఎం కేసీఆర్‌ పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వేర్వేరుగా నిర్వహించుకొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమర వీరులకి నివాళులు అర్పించిన తరువాత గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు, బలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణవాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు. 

పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన వేడుకలలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “కేంద్రం సహాయసహకారాలు లేనప్పటికీ ఈ 8 ఏళ్ళలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొన్నాము. తెలంగాణ ఏర్పడక మునుపు ఆంద్రా పాలకుల వివక్షను ఎదుర్కొన్నాము. ఇప్పుడు కేంద్రప్రభుత్వ వివక్షను ఎదుర్కోవలసివస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పధకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం నిధులు ఇవ్వలేదు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం నిరాకరిస్తోంది. రాష్ట్రంలో ఐటిఐఆర్ ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్రం మాట తప్పింది. కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడవలసిన కేంద్రప్రభుత్వం ఒకటొకటిగా రాష్ట్రాల హక్కులు హరించివేస్తూ సర్వాధికారాలను గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్రాలను బలహీన పరుస్తోంది. 

కనుక ఇప్పుడు కేంద్రంతో కూడా పోరాడవలసి వస్తోంది. అయితే ఎన్ని సమస్యలు, సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం స్థిరంగా అభివృద్ధి సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటున్నాము. తెలంగాణ అభివృద్ధిని ఏ పార్టీలు, రాజకీయ శక్తులు అడ్డుకోలేవు,” అని అన్నారు.