12.jpg)
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బిజెపి ఆ ప్రయత్నాలలో భాగంగా వచ్చే నెల 2,3 తేదీలలో హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించబోతోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2003లో హైదరాబాద్ వైస్రాయి హోటల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. మళ్ళీ 19 ఏళ్ళ తరువాత హైదరాబాద్‌లో జరుగబోతున్నాయి. తద్వారా తెలంగాణపై బిజెపి అధిష్టానం దృష్టి సారించిందని స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది.
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరుగబోయే సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నిన్న హైదరాబాద్ వచ్చారు. ఆయన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్ చుగ్‌లతో కలిసి నోవా టెల్, తాజ్ కృష్ణ హోటల్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలు అందరూ కలిపి సుమారు 300 మంది హాజరవుతారని తెలిపారు. వారిలో ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజులు రాజ్‌భవన్‌లో బస చేస్తారని, మిగిలినవారికి నోవాటేల్, తాజ్ కృష్ణతో సహా పలు హోటల్స్‌లో ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.