బిజెపి సీనియర్ నేత కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు

తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు ఆ పార్టీ అధిష్టానం రాజ్యసభకు పంపించబోతోంది. బిజెపికి తెలంగాణలో తగినంత మంది ఎమ్మెల్యేలు లేనందున కె.లక్ష్మణ్‌ను బిజెపి పాలిత ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక చేసి రాజ్యసభకు పంపించబోతోంది. 

నేటితో రాజ్యసభ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖరి రోజు కావడంతో బిజెపి అధిష్టానం కె.లక్ష్మణ్‌తో సహా మరో మూడు రాష్ట్రాలకు చెందిన ముగ్గురి పేర్లను నిన్న ప్రకటించింది. 

తెలంగాణ బిజెపికి చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్, సోయమ్ బాపురావులు లోక్‌సభలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ బిజెపి నుంచి రాజ్యసభలో అడుగుపెడుతున్న తొలి వ్యక్తిగా కె.లక్ష్మణ్‌ నిలిచారు.

తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. కనుక అన్నీ పార్టీలు కుల సమీకరణ లెక్కలు సరిచూసుకొంటూ ముందుకు సాగుతున్నాయి. మున్నూరు కాపు వర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్రకు టిఆర్ఎస్‌ రాజ్యసభ టికెట్ కేటాయించగా, బిజెపి కూడా అదే సామాజికవర్గానికి చెందిన కె.లక్ష్మణ్‌కు టికెట్ కేటాయించి, ఆ వర్గ ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది. 

తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కె.లక్ష్మణ్‌ ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్రహోంమంత్రి అమిత్ షాకి, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికలలో గెలిపించుకొని అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని చెప్పారు.