
అలనాటి అందాల నటి, బీజేపి మహిళా నేత జయప్రద సోమవారం హిమాయత్ నగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించడం సరికాదనే భావన వ్యక్తం చేశారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పించి, వారికి నేనున్నాననే భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. కనుక సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనే ఆలోచన సరికాదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
తాను అనేక ఏళ్ళగా తెలుగు ప్రజలకు దూరంగా యూపీ రాజకీయాలలో ఉండిపోయానని అన్నారు. తనకు మళ్ళీ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలోకి రావాలని ఉందని అన్నారు. ఇదే విషయం తమ అధిష్టానానికి తెలిపి ఆమోదిస్తే వచ్చే ఎన్నికల నాటికి తప్పకుండా ఏపీ లేదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశిస్తానని జయప్రద చెప్పారు.
జయప్రద చాలా కాలం తరువాత తెలంగాణలో అడుగుపెట్టగానే సిఎం కేసీఆర్ ఆలోచనను తప్పు పట్టడం విశేషం. ఆమె బీజేపి నేత కనుకనే ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చు. అయితే నరేంద్ర మోడీ కూడా ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపినందుకే జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించి ప్రధాని మంత్రి పదవి చేపట్టిన సంగతి జయప్రదకు గుర్తున్నట్లు లేదు. ఆమె మరిచిపోయినా రేపు టిఆర్ఎస్ నేతలు గుర్తుచేయకుండా ఉండరు.